ప్రజలతో ఆటలాడుతున్న తండ్రీ కొడుకులు

Views: 179

ములాయం సింగ్ యాదవ్, ఆయన తనయుడు అఖిలేష్ యాదవ్ లు ఉత్తర్ ప్రదేశ్ లో పార్టీ కేడర్ తో ఆడుకుంటున్నారు. ఆట అంటే అలాంటిలాంటి ఆట కాదు పక్కాగా కబడ్డీ..లేకపోతే బంతాట.. ఉదయం నేతలు తిట్టుకుంటారు. పార్టీ నుంచి బహిష్కరణలు చేసుకుంటారు. ఎవరికీవారే అధ్యక్షులుగా ప్రకటించుకుంటారు. పార్టీ గుర్తు తమదంటే తమదని ఎన్నికల సంఘాన్ని ఆశ్రయిస్తారు. చీకటి పడేలోపు కలిసిపోతారు. పాపం ఈ విషయం తెలియని పార్టీ కేడర్ అలా విడిపోయిన నేతల్లో ఎవరో ఒకరి పంచన చేరి…వారి తరఫున వకల్తా పుచ్చుకొని వీధి పోరాటాలు చేస్తారు. ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటారు. నమ్మిన నాయకుడికోసం నెత్తురోడుతారు. అవసరమైతే ప్రాణత్యాగం సైతం చేస్తారు. యేడాదికాలంగా యూపీలోని ఎస్పీలో జరుగుతున్నది ఇదే. ‘సీటు’, ఆధిపత్యం కోసం ములాయం కుటుంబంలో పుట్టిన ముసలం పార్టీనంతటికి వ్యాపింపజేసి…క్యాడర్ మధ్యే తగువులకు దారితీస్తోంది.

పిల్లలు తప్పు చేస్తే ఇంటిపెద్ద మందలిస్తాడు. మరి ఆ ఇంటిపెద్దే తప్పు చేస్తే.. పిల్లలు సైతం తిరగబడే కాలం ఇది. సరిగ్గా ఉత్తర్ ప్రదేశ్ సమాజ్ వాదీ పార్టీ ఫ్యామిలీలో అదే జరిగింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితా రూపకల్పనలో తలెత్తిన వివాదంలో సీఎంగా ఉన్న తనయుడు అఖిలేష్ యాదవ్ ను అధినేత ములాయం సింగ్ యాదవ్ పార్టీ నుంచి బహిష్కరించారు. యూపీ అధ్యక్షుడు, అఖిలేష్ బాబాయ్ ఒక లిస్టు తయారు చేస్తే…సీఎంగా ఆయన కూడా మరో లిస్టు తయారు చేశారు. వీరిద్దరికి మించి ములాయం (శివపాల్ లిస్టులో నుంచే) మరో లిస్టును తయారు చేశారు. ఇదే అసలు వివాదానికి కారణమైంది.

మూడు నెలల క్రితం బాబాయ్ శివపాల్ అబ్బాయి అఖిలేష్ ల మధ్య వివాదాలు తారస్థాయికి చేరుకున్నప్పుడు కూడా వీరి అనుచరులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు.అఖిలేష్ ను పార్టీ నుంచి బహిష్కరించాక కూడా అలాంటి పరిస్థితే ఎదురయ్యేది. అందుకే అఖిలేష్ వర్గం..ములాయం, శివపాల్ వర్గంతో తగువులు సైతం పెట్టుకుంది.
ఈరెండు గ్రూపులకు సంబంధం లేకుండా కేవలం ఎస్పీ సిద్ధాంతాలు, వెనుకబడిన వర్గాల నాయకత్వంలో పనిచేస్తుందన్న ఒకే కారణంతో సైకిల్ పార్టీకి గుడ్డిగా మద్దుతిచ్చే వాళ్లు చాలామంది ఉన్నారు.

తండ్రీకొడుకులు తగువులాడి…విడిపోయిన ప్రతిసారి లేదా విడిపోయే పరిస్థితులొచ్చిన ప్రతిసారి ఎవరివైపు నిలవాలో తెలియని అలాంటి జనం నానా ఇబ్బందులు పడుతున్నారు. కొంతమందైతే ‘ఇక వీరు మారరు’ అని ఎస్పీ నుంచి మరో పార్టీ చూసుకుంటున్నారు.

ముప్పు తిప్పులు పెట్టిన కొడుకుతో వేగలేక ములాయం చివరికి చేతులెత్తేశాడు. కష్టపడి పార్టీ పెట్టి…దాన్ని అధికారంలోకి తీసుకొచ్చిన ములాయం…చివరికి అది తనది కాకుండా పోతుందనే బెంగ, సైకిలు చేజారిపోతుండటంతో దిగొచ్చాడు. ఈ వయసులో ఈ కష్టాలేంటనీ…కొడుకు కోరిందే ఇచ్చేద్దామంటూ..తిట్టిన నోటితోనే..బహిష్కరించిన చేతులతోనే ‘ఎస్, అఖిలేష్ యాదవ్ మా ముఖ్యమంత్రి’ అని ప్రకటించేశారు. అయినా ఈ ఫ్యామిలీలో అపరిష్కృతంగా ఉన్న చాలా సమస్యలకు ఇంకా పరిష్కారం దక్కలేదు. వాటి సంగతేంటో…? వీరు కలిసుంటారో ….మళ్లీ వీధిపోరాటాలు చేస్తారో…డవుటే.. అధికారం కుటుంబం సభ్యులకు తప్ప మరో వ్యక్తికి దక్కకుండా చేసేందుకు ఫ్యామిలీ మొత్తం కలిసి ఆడే ఫ్యామిలీ సర్కస్ అని విమర్శిస్తున్నవాళ్లు లేకపోలేదు.

Comments: 0

Your email address will not be published. Required fields are marked with *