తండ్రి..కొడుకు..సోదరి.. మధ్యలో మోదీ…: మినీ భారత్ ఎవరిదో…?

Views: 333

ఉత్తర్ ప్రదేశ్ అలియాస్ మినీ భారత్ అసెంబ్లీ ఎన్నిలకు షెడ్యూల్ ఖరారయ్యింది. 403 అసెంబ్లీ సీటున్న అతి పెద్ద రాష్ట్రంలో ఏడు విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి. యూపీలో దాదాపు 20కోట్ల మంది జనాభా ఉన్నారు. ఉత్తర్ ప్రదేశ్ ఎవరి ఆధీనంలో (పవర్) ఉంటారో భారతదేశం (కేంద్రం) వారి చేతుల్లో ఉంటుందని రాజకీయ విశ్లేషకులు తరచూ చెబుతుంటారు. ఎందుకంటే ఈ ఒక్కరాష్ట్రంలోనే 80 లోక్ సభ స్థానాలున్నాయి. 2014 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ యూపీలో 73స్థానాలు సొంతంగా గెలుచుకుంది.

ప్రస్తుతం అధికార సమాజ్ వాదీ పార్టీకి 224, 80 బహుజన్ సమాజ్ పార్టీకి, బీజేపీ 47, కాంగ్రెస్ కు 22 స్థానాలున్నాయి. ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ఆయన తనయుడు సీఎం అఖిలేష్ ల మధ్య విభేదాలు రావడంతో ఫ్యామిలీ పార్టీ నిలువునా చీలింది. మెజార్టీ ఎమ్మెల్యేలంతా అఖిలేష్ టీంలోనే ఉన్నారు. ఏజ్ ఓల్డ్ నేతలు మాత్రమే ములాయం శిబిరంలో ఉన్నారు. దీనికి తోడు తమకిచ్చిన హామీలు నెరవేర్చనందుకు ఎస్పీకి తగిన బుద్ధి చెబుతామని ముస్లింలు బాహాటంగా హెచ్చరిస్తున్నాయి.

పైగా ఎస్పీ ఎన్నికల గుర్తు సైకిలు తమదంటే తమది తండ్రీకొడుకులు న్యాయపోరాటాని సిద్ధమయ్యారు. ఈనేపథ్యంలో ఎన్నికలు జరగనున్నాయి. తండ్రీకొడుకులు రాజీకొచ్చి ఒకే గుర్తు పోటీ చేస్తే తప్ప ఆ పార్టీ మనుగడం కష్టమైంది. అటు సొంతంగా షీలా దీక్షిత్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ కాంగ్రెస్ కు మరో పెద్ద పార్టీ తోడైతే తప్ప నెట్టుకురాలేని పరిస్థిది. అఖిలేష్ టీమ్ తో రాహుల్ (కాంగ్రెస్) పొత్తు పెట్టుకునే అవకాశం ఉంది.

ఇక దళితులు, బ్రాహ్మణులు, ముస్లింల కలయికలో కొత్త ఫార్ములాతో 2007లో అధికారం చేపట్టిన బీఎస్పీది ఇప్పుడు జీవన్మరణ సమస్య. 2014 లోక్ సభ ఎన్నికల్లో బీఎస్పీ కనీసం ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. మాయావతి భుజస్కందాలపైనే నడుస్తున్న బీఎస్పీ ఈసారి గెలవకపోతే.. ఆ ప్రభావం వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఆ పార్టీ శ్రేణులకు ‘హోప్’ కరువవుతుంది. భవిష్యత్ పీఎం బెహన్ జీ అని ఆశలు పెట్టుకున్న దళిత, బహుజన వర్గాలకు ఇదో పరీక్షా కాలం. యూపీలో అఖిలేష్ హయంలో చోటుచేసుకున్న దళితులు, ముస్లింలపై దాడులు, ఎస్పీలో చీలిక బీఎస్పీకి కలిసి వచ్చే అంశాలు.

ఎస్పీలో చీలికను కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తోంది. ఇప్పటికే పీఎం మోదీ ఈ రాష్ట్రంలో పరివర్తన ర్యాలీల పేరిట భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ఆ సభలకు జనం విశేషంగా హాజరవుతున్నారు. ఈ సభల్లో ఆయా వర్గాలకు మోదీ భారీగానే తాయిలాలు ప్రకటిస్తున్నారు. సర్జికల్ దాడులతో తన గ్రాప్ ను అమాంతంగా పెంచుకున్న మోదీ…పెద్దనోట్ల రద్దు తర్వాత ప్రజాగ్రహాన్ని చవిచూశారు. అవినీతి, నల్లధనం, దొంగనోట్లు, తీవ్రవాదం నిర్మూలనకోసం పెద్దనోట్లను రద్దు చేశామని దీనికి ప్రజల సంపూర్ణ మద్దతు ఉందని కమలనాథులు విశ్వసిస్తున్నారు. ఓటరు మద్దతు మాత్రం ఎవరికి అనేది మార్చి 11న తేలనుంది.

Comments: 0

Your email address will not be published. Required fields are marked with *