అఖిలేష్ అప్పుడే పార్టీ పెట్టారు కానీ…

Views: 338

సమాజ్ వాదీ పార్టీలో ఏడాదిగా ఫ్యామిలీ స‌ర్క‌స్ న‌డుస్తోంది. ఐతే కుటుంబంలో రగులుతున్న వివాదంతో అఖిలేష్ అండ్ బాబాయ్ ముందే ప్రీపేర్ అయ్యారా? అంటే ఎస్….అంటున్నారు విశ్లేష‌కులు.

కాంట్ర‌వ‌ర్సీ క్ర‌మ‌క్ర‌మంగా చినికిచినికి గాలి వాన‌గా మారి….ఇప్పుడు సునామీలా ముంచెత్తింది. ఈ యేడాది అక్టోబర్ లో బాబాయ్ శివపాల్ యాదవ్ తో విబేధాలు తారస్థాయికి చేరుకోవడంతో…ఆయన వర్గానికి చెందిన మంత్రులను అఖిలేష్ కేబినేట్ నుంచి తొలగించారు. ఐతే అఖిలేష్ వర్గానికి చెందిన నేతలను ములాయం పార్టీ నుంచి బహిష్కరించారు. తండ్రి ములాయం, బాబాయ్ శివపాల్ యాదవ్ కే ప్రాధాన్యమిస్తున్నారని…వచ్చే ఎన్నికల్లో త‌న‌ను సీఎంగా అభ్యర్థిగా ప్రకటించనందుకు అఖిలేష్ కోపంతో ర‌గిలిపోతున్నారు.

అఖిలేష్ ప్రాధాన్యం త‌గ్గిపోవ‌డం, బాబాయ్ ఇమేజ్ పెరిగిపోవ‌డంతో స‌మాజ్ వాదీ పార్టీ నుంచి కొత్త పార్టీ పుడుతుందా …అన్న అనుమానాల‌కు కొద్ది రోజుల్లోనే స‌మాధానం దొరికింది. అఖిలేష్ కొత్తపార్టీ పెట్టబోతున్నాడని..ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ రామ్ గోపాల్ యాదవ్ ఢిల్లీలో చూసుకుంటున్నారని, ఎన్నికల సంఘం వద్ద కొత్త పార్టీ రిజిస్ట్రర్ కూడా చేయించినట్లు జోరుగా ప్రచారం జరిగింది.

ఇక క్యాడ‌ర్ ను కూడా త‌మ వైపు తిప్పుకునేందుకు రామ్ గోపాల్ మంత‌నాలు కూడా జ‌రిపిన‌ట్టు తెలిసింది. అఖిలేష్ వైపు ఉండి రాష్ట్రాన్ని ర‌క్షించండి అంటూ లేఖ కూడా రాసిన విష‌యం ఓపెన్ సీక్రెటే.. దీంతో అఖిలేష్ కొత్త పార్టీ పక్కా అనుకుని తేలిపోయింది. కొత్త పార్టీ ఏర్పాట్లు కూడా దాదాపు పూర్తయ్యాయి. ఆ త‌ర్వాత కాస్త గ్యాప్ వ‌చ్చింది. జనవరిలో ఎన్నికలు ఉండటం, బీజేపీ, బీఎస్పీలు రాష్ట్రంలో బలపడుతుండటం, ,మరోవైపు ఎస్పీని స్థాపించి 25ఏళ్లు కావడం…వంటి కారణాలతో ములాయం రంగంలోకి దిగి తమ్ముడు శివపాల్, తనయుడు అఖిలేష్ యాదవ్ ల మధ్య విబేధాలు సమసిపోయేలా సంబంధాలు చక్కదిద్దారు. పైగా పార్టీ నుంచి సస్పెండ్ అయివారిని తిరిగి తీసుకున్నారు. అంతా మళ్లీ కలిసిపోవడంతో అఖిలేష్ అండ్ టీం కొత్తఏర్పాట్లకు తాత్కాలిక విరామం ఇచ్చారు. దీంతో అంతా సమసి పోయిందని అనుకున్నారు.

ఎన్నికల అభ్యర్థుల జాబితా ప్రకటనలో మళ్లీ యుద్ధం మొదలైంది. యూపీ ఎస్పీ అధ్యక్షుడిగా శివపాల్, సీఎంగా అఖిలేష్ లు ఎవరికీవారు సొంతలిస్టులు తయారు చేసి ములాయంకు అందించారు. ములాయం తమ్ముడు సూచించిన వారికే పెద్ద పీట వేస్తూ అఖిలేష్ వర్గానిక మొండి చూపుతూ ఫైనల్ లిస్టు ప్రకటించారు. దీంతో అఖిలేష్ తండ్రిని ధిక్కరిస్తూ సొంత లిస్టు ప్రకటించారు. దీంతో ములాయం తనయుడిపై వేటు వేయక తప్పలేదు.

సాక్షాత్తు సీఎంను సస్పెండ్ చేయ‌డ‌మంటే మామూలు విష‌యం కాదు… అఖిలేష్ కూడా తనపై వేటు వేస్తేనే ప్రజల నుంచి మరింత సానుభూతి వస్తుందని భావించారు. అందుకే వేచి చూశారు. ఇప్పుడు కొత్తపార్టీని ప్రకటించక తప్పని పరిస్థితి. అందుకే రాంగోపాల్ యాదవ్ ఢిల్లీలో కొత్తపార్టీ ఏర్పాట్లకు సంబంధించిన ప్రక్రియ వేగవంతం చేసినట్లు తెలిసింది. సమయం లేనందున..ఎస్పీకి పోటీగా కొత్తపార్టీని ప్రకటించి..ఎన్నికల బరిలో నిలవడమే అఖిలేష్ ముందున్న వ్యూహం.

Comments: 0

Your email address will not be published. Required fields are marked with *